English | Telugu
రెహమాన్ కుమారుడికి తృటిలో తప్పిన ప్రమాదం
Updated : Mar 5, 2023
ప్రముఖ సంగీత దర్శకుడు, జంట ఆస్కార్లను గెలుచుకున్న ఇసైపుయల్ ఎ.ఆర్.రెహమాన్ కుమారుడు ఎ.ఆర్. అమీన్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ఎ.ఆర్. అమీన్ సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఎ.ఆర్.రెహమాన్, సైరాభానుకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు ఎ.ఆర్. అమీన్‌కి తండ్రిలాగానే సంగీతమంటే చాలా ఇష్టం. `ఓ కాదల్ కన్మణి`, `సచిన్`, `2.0`వంటి చిత్రాల్లోనూ అమీన్ పాటలు పాడారు. అమీన్ సొంతంగానూ చాలా పాటలకు ట్యూన్లు కట్టి సోలోగా ప్రైవేట్‌గానూ రిలీజ్ చేస్తుంటారు. రీసెంట్‌గా ఓ పాటను సింగిల్ చేయడం కోసం కంపోజ్ చేశారు. దాన్నే వీడియో చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అందుకోసం తన టీమ్‌తో షూటింగ్ ప్లాన్ చేశారు. షూటింగ్ జరుగుతుండగా క్రేన్‌కి తగిలించిన దీపాలు సడన్‌గా కిందపడిపోయాయి. అవి అమీన్ నిలుచున్న ప్లేస్‌కి కుడివైపుగా పడ్డాయి. దీని గురించి అమీన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
``నాకు ప్రమాదం తృటిలో తప్పింది. మేం సింగిల్ చేయాలనుకున్నాం. దాన్ని షూట్ చేయడం కోసం మా టీమ్‌తో ఒక ప్రదేశానికి వెళ్లాం. అక్కడ క్రేన్‌కి తగిలించిన వస్తువులు ఒక్కసారిగా కుప్పకూలి కిందపడ్డాయి. నాకు కుడివైపుగా పడ్డాయి. నేను కాస్త అటూ ఇటూ జరిగినా నా మీద పడేవి. లేకుంటే, గాలికి అది కాస్త ఇటు కదిలినా నా మీదే పడేది. ఇవాళ నన్ను ప్రాణాలతో చూసేవారు కాదు. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. దేవుడికి, నా తల్లిదండ్రులకు, గురువులకు, శ్రేయోభిలాషులకు, అభిమానగణానికి అందరికీ ధన్యవాదాలు. ఈ దుర్ఘటన జరిగి మూడు రోజులైంది. అయినా ఇంకా మా టీమ్ షాక్ నుంచి తేరుకోలేదు. ఇప్పటికీ మా కళ్ల ముందు పడ్డ వస్తువులే కనిపిస్తున్నాయి. చాలా ఆందోళనగా అనిపించింది. ఆ లైట్లు మీద పడి ఉంటే జరిగే నష్టాన్ని ఊహించలేకపోతున్నాం`` అని అన్నారు.